Friday, October 7, 2011

కంప్యూటర్‌ మాంత్రికుడు స్టీవ్స్‌జాబ్స్‌..,Steve Jobs



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ ---కంప్యూటర్‌ మాంత్రికుడు స్టీవ్స్‌జాబ్స్‌-Steve Jobs--- - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


(February 24, 1955 – October 5, 2011)

* ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టిన ఐఫోన్‌ సృష్టికర్త మరణం--కంప్యూటర్‌ మాంత్రికుడు, ఐఫోన్‌ సృష్టికర్త, యాపిల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్స్‌జాబ్స్‌(56) ఇకలేరు. 2004 నుంచి ఉదర సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్న స్టీవ్స్‌ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఐఫోన్‌ 4ఎస్‌ విడుదలైన మరుసటి రోజే స్టీవ్స్‌ మరణం కంప్యూటర్‌ ప్రపంచాన్ని కలచివేసింది.

సిలికాన్‌ వ్యాలీ దిగ్గజం
స్టీవ్‌జాబ్స్‌... అధునాతన కంప్యూటర్‌ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి. కంప్యూటర్‌ రంగంలో తనదైన ముద్రవేసి సిలికాన్‌ వ్యాలీ దిగ్గజంగా ఖ్యాతికెక్కారు. 1955 ఫిబ్రవరి 24న శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించిన జాబ్స్‌ను పాల్‌, క్లారా జాబ్స్‌ దంపతులు దత్తతకు తీసుకున్నారు. కళాశాల విద్యాభ్యాసాన్ని జాబ్స్‌ మధ్యలోనే వదిలిపెట్టాడు. అనంతరం ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తితో వాటిపై అధ్యయనం చేశాడు. భారతీయ ఆధ్యాత్మికత, హరేరామ హరేకృష్ణ ఉద్యమంపై జాబ్స్‌కు ఆసక్తి ఎక్కువ. దీని కోసం ఆయన భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలు సందర్శించాడు. అనంతరం అమెరికాకు తిరిగివెళ్లి స్నేహితులు స్టీవ్‌వొజ్‌నిక్‌, రొనాల్డ్‌ వేన్‌లతో కలిసి ఆపిల్‌ కంపెనీని నెలకొల్పాడు. తరువాత ఆపిల్‌ నుంచి తప్పుకున్న జాబ్స్‌ లారెన్‌ పోవెల్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆపిల్‌ నుంచి వెళ్లిన తరువాత నెక్ట్స్‌ అనే కంపెనీని స్థాపించాడు. కొద్దికాలానికే నెక్ట్స్‌ను ఏపిల్‌ కొనుగోలు చేయడంతో మాతృ సంస్థలోకి జాబ్‌ తిరిగివచ్చాడు. ఐపాడ్‌, మాకింటోష్‌ సిస్టమ్స్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌... తదితర అధునాతన ఆవిష్కరణలను సృష్టించాడు.
ముప్పైఏళ్ల ముందు కంప్యూటర్లు పెద్దవిగా చాలా తక్కువ స్టోరేజీతో ఉండేవి. అలాంటి సమయంలోనే జనవరి 24 1984లో స్టీవ్‌జాబ్స్‌ ఏపిల్‌ కంప్యూటర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. మేకింటోష్‌ ఆపరేటింగ్‌పై నడిచే ఏపిల్‌ పీసీ కంప్యూటర్‌ ప్రపంచంలో ఒకనూతనశకానికి నాం దిపలికింది. అనంతరం జాబ్స్‌ పరిచయం చేసిన ఐపాడ్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌, ఐట్యూన్స్‌ ... తదితర ఆవిష్కరణలు సాంకేతిక ప్రపంచంలో ఎన్నో మార్పులకు తెర తీశాయి. నానో టెక్నాలజీని ఉపయోగించి తక్కువ బరువు, ఎక్కువ స్టోరేజీతో ఉన్న ఫోన్లు, ఐపాడ్‌ షఫిల్‌ ఆపిల్‌ కంపెనీకి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

టచ్‌స్క్రీన్‌ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన ఐఫోన్లు ప్రపంచంలో ఎన్నో అధునాతన స్మార్ట్‌ ఫోన్లకు మార్గదర్శకంగా నిలిచింది. స్మార్ట్‌ ఫోన్ల శకం ఇక్కడి నుంచే ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఐప్యాడ్‌ టాబ్లెట్‌ పీసీ మరో నూతన టెక్నాలజీ శకానికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌ ఫోన్‌ కంటే పెద్దదిగా లాప్‌ట్యాప్‌ కంటే చిన్నదిగా టచ్‌ టక్నాలజీతో తయారు చేసిన ఐప్యాడ్‌ టాబ్లెట్‌ పీసీల చిత్రాన్ని సమూలంగా మార్చివేసింది. 3జీ సౌకర్యంతో పాటు ఫోన్‌, కంప్యూటర్‌గా పనిచేయగల సామర్థ్యమున్న ఈ టాబ్లెట్‌ పీసీల చుట్టే సమకాలీన ప్రపంచం తిరుగుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
56 ఏళ్ల జాబ్స్‌ గత కొంతకాలంగా ఉదరకోశ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టులో ఆయన ఏపిల్‌ సీఈవో పదవీ బాధ్యతల నుంచి తప్పుకొని సహచరుడు టిమ్‌కుక్‌ను నియమించారు.
* 'స్టీవ్స్‌ లేరన్న విషయాన్ని వెల్లడించడానికి ఎంతో చింతిస్తున్నాం, ఇది కేవలం ఒక్క యాపిల్‌ సంస్థకే కాదు.. యావత్‌ ప్రపంచానికి మింగుడు పడని వార్త. ఓ సృష్టికర్తను మనం కోల్పోయాం. -యాపిల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైర్టక్టర్స్‌.
* కుటుంబం పట్ల జాబ్స్‌కు ప్రత్యేక అభిమానం, ఆప్యాయతలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న స్టీవ్స్‌ కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు- జాబ్స్‌ కుటుంబం
* జాబ్స్‌ కంప్యూటర్‌ రంగంలో నవకల్పనలకు ఆద్యుడు. ప్రపంచం ఓ సృజనశీలుడ్ని కోల్పోయింది.- ప్రధాని మన్మోహన్‌
* స్టీవ్‌ మంచి స్నేహితుడు, గట్టి పోటీదారు, ఆయన మరణించాడన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.-బిల్‌గేట్స్‌

-- Eenadu news paper 07/10/2011
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thank you for your comment.